Site icon NTV Telugu

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన ప్రచారం.. ఇంకా మిగిలింది 4 రోజులే..

Elections

Elections

Election Campaign Speed Up In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్‌ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. ఇవాళ ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 4 రోజులే ఉండడంతో.. ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రోజుకు మూడు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామన్నారు. అలాగే కూటమి నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Read Also: Lok Sabha Elections 2024 : పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్‌షోలో మాట్లాడిన సీఎం రేవంత్.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అని ఆరోపణలు చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్‌, తర్వాత బీజేపీ వాళ్లు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్‌ రూపంలో బీజేపీ,బీఆర్‌ఎస్‌కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలతో గులాబీ శ్రేణులలో జోష్‌ పెంచుతున్నారు. మెదక్‌ జహీరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలు చేయలేదని.. ప్రజలను రాచిరంపాన పెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారు వల్ల అచ్చేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌ వచ్చాయని ఎద్దేవా చేశారు.

ఇలా ఎక్కడికక్కడి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాని వచ్చిన ప్రధాని మోడీ.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఇవాళ వేములవాడ, వరంగల్‌ ప్రచార సభలలో ప్రసంగించనున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజక వర్గం కలికిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

 

Exit mobile version