కోవిడ్ మహమ్మారి కారణంగా గత ఏడాది నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి. మధ్యలో కొంతకాలం మినహా దాదాపు 18 నెలలుగా ఆన్‌లైన్ పద్ధతిలోనే విద్యా బోధన సాగుతోంది.. అయితే, ప్రత్యక్ష బోధనకు అనుమతించాలంటూ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ సైతం పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయని.. ఆన్‌లైన్ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై దృష్టిసారించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.. విద్యా సంస్థలు తెరవొచ్చని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది.. మరోవైపు తాజా పరిస్థితులపై విద్యాశాఖ నుంచి కూడా సీఎం కేసీఆర్‌కు ఇవాళ నివేదిక అందించనట్టుగా చెబుతున్నారు. ఇక, ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తే.. మొదట 9, 10 తరగతులతో పాటు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులివ్వడం మేలని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని కింది తరగతులకు అనుమతులిస్తే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు విద్యాశాఖ చెబుతోంది.. విద్యాశాఖ తాజా ప్రతిపాదనల మేరకు.. 1–8 తరగతుల విద్యార్థులకు మరికొంత కాలం ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.. అయితే, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కొందరి నుంచి వ్యతిరేకత కూడా ఉందంటున్నారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై విద్యాశాఖ ఒకింత విముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.. థర్డ్ వేవ్‌పై ఊహాగానాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు సరైనవి కావనే అభిప్రాయాలున్నాయి.. వీటి అన్నింటిపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్టుగా తెలుస్తోంది.