సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఇక ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. సీఈసీ రాజీవ్‌కమార్, సీనియర్ ఎన్నికల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో తీసుకోవల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో మొత్తం 2150 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ట్వీట్ చేసింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఈసీ ట్వీట్ చేసింది.
మరోవైపు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్టీలు ఎన్నికల యుద్ధంలోకి దిగిపోయాయి. ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. బీజేపీ ఇప్పటికే 195 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ కూడా 39 మందితో కూడిన ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసింది. ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ కూడా పబ్లిక్ మీటింగ్‌లో అభ్యర్థులను ప్రకటించి.. ప్రజలకు సీఎం మమత పరిచయం చేశారు. ఇలా ఆయా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ప్రధాని మోడీ కూడా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇండియా కూటమి కూడా అధికారంపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది.