కాస్త ఖరీదైన సెల్ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో.. తన సొంత ఊరిలోనే ఓ ఇంటిని నిర్మించి తన ఇంట్లో తన తల్లి నాగమ్మను ఉంచాడు. ఇక నాగమ్మ పెద్ద కొడుకు పెద్ద బజారి గ్రామంలో బతుకు తెరువు కష్టంగా ఉండడంతో గుంటూరుకు బతుకుతెరువు కోసం వెళ్ళాడు. అయితే వారి కుమారుడు వెంకటేష్ అక్కడే ఉండి చెడు వ్యసనాలకు లోనయ్యాడు. ఇందులో భాగంగానే తనకు ఖరీదైన సెల్ఫోన్ కావాలని వాటికి డబ్బులు లేకపోవడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వెంకటేష్ పెద్దమరివీడుకు వచ్చేశాడు. అయితే తన అనుకున్న ప్లాన్ ప్రకారం.. బంగారాన్ని దొంగలించి ఆ డబ్బుతో ఖరీదైన సెల్ఫోన్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో.. మార్చి 4వ తేదీ సాయంత్రం నాగమ్మ ఇంటికి మనవడు వెంకటేష్ వెళ్ళాడు. అక్కడే నాగమ్మ గొంతును నులిమి హత్య చేశాడు. ఆపై నాగమ్మ ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారం ఆభరణాలను తీసుకున్నాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో వారి ఇంటి ఆవరణలోనే గుంతను తవ్వి వెంకటేష్ తన నానమ్మ నాగమ్మను అక్కడి పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత తనకి ఏమీ తెలియనట్లు మెరుసటి నాడు ఉదయం ఎమ్మిగనూరు నగరానికి వెళ్లి అక్కడ బంగారాన్ని విక్రయించాడు. ఆ తర్వాత రూ. 25000 పెట్టి కొత్త సెల్ఫోన్ తీసుకున్నాడు. ఆ వెంటనే సాయంత్రం గుంటూరులోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెంకటేష్ చేరుకున్నాడు. పరిస్థితి ఇలా ఉండగా.. మార్చి 13వ తేదీన నాగమ్మ చిన్న మనవడు గోపాల్ గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో తన నానమ్మ ఇంట్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన అతను గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులకు గతంలో వెంకటేష్ నాగమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని కనుక్కొని.. వెంకటేష్ ని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నీతో అసలు బాగోతాన్ని వెంకటేష్ ఒప్పుకున్నాడు. దీంతో హత్య చేసిన వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కు పంపించారు.