Drugs Party: గచ్చిబౌలి ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. స్టార్ హోటల్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో నగరంలో సంచలనం నెలకొంది. తెలంగాణ ఈగిల్ (EAGLE) ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సేవించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్ బండా ప్రాంతంలో ఉన్న కోవ్ స్టేస్ (Kove Stays) హోటల్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సమయంలో రూమ్ నెంబర్ 309పై ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!
దాడుల సమయంలో గదిలో ఏడుగురు మద్యం సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిని పూర్తిగా తనిఖీ చేసినప్పటికీ, అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు భౌతికంగా లభించలేదు. అయితే అనుమానం రావడంతో అందరికీ యూరిన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఐదుగురికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. వారు గత రోజే గంజాయి సేవించినట్లు విచారణలో స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన వారిలో మెఘేందర్ (29), తేజేశ్వర్ (28), సాయి ప్రసాద్ (28), రమేష్ (27), టి. రవి (27) ఉన్నారు. ఒక వివాహ వేడుకలో తొలిసారిగా గంజాయి సేవకు అలవాటు పడ్డామని, ఆ అలవాటు క్రమంగా కొనసాగుతోందని విచారణలో వెల్లడైంది. తాజాగా రీయూనియన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో గచ్చిబౌలిలోని కోవ్ స్టేస్ హోటల్‌లో గది బుక్ చేసుకుని పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 41/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
డిజిటల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. Amazon Pay Fixed Deposit సర్వీస్ లాంచ్..!
డ్రగ్ పార్టీలో పాల్గొన్నవారిలో హైదరాబాదులోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న యువకులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ కేసులో పోలీస్ శాఖకు చెందిన ఒక అధికారి కూడా పట్టుబడినట్లు సమాచారం రావడం తీవ్ర చర్చకు దారితీసింది. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, డ్రగ్స్‌పై కఠిన చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా అవసరమని పోలీసులు పేర్కొన్నారు. నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.