Driving Licence: మీకు టూవీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉందా ? డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం కేంద్రప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్‌టీవో)కు వెళ్లాల్సిన పని లేదు. సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ రూపొందించింది. వీటి ప్రకారం ప్రజలు ఆర్‌టీవో ఆఫీస్‌లో డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది. సవరించిన రూల్స్ 2022 జూలై 1 నుంచే అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఆర్‌టీవో ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేదు.
ప్రభుత్వం డ్రైవింగ్ సెంటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అందించే అధికారాన్ని ఇచ్చింది. అయితే కొన్ని కండీషన్స్ పెట్టింది. ఆ అధికారం అన్ని సెంటర్లకు ఉండదు. కొన్ని అక్రెడిటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లకు మాత్రమే కల్పించింది. డ్రైవర్ ట్రైనింగ్ అనంతరం వారికి డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తాయి. అంటే డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లెసెన్స్ వస్తోందని చెప్పుకోవచ్చు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్స్‌లో చేరి ట్రైనింగ్ తీసుకుని పరీక్షలో పాసైన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హులు. డ్రైవింగ్ స్కూల్ ఇచ్చే ఈ సర్టిఫికెట్ ఆధారంగానే లైసెన్స్ జారీ అవుతుంది.
Read Also: YS Avinash Reddy: వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. సంచలన వీడియో..!
జనాభాకు తగిన విధంగా ఆఫీసులు లేకపోవడం, పనిభారం పెరిగిపోవడం వల్ల లైసెన్స్‌ల ఆర్టీవో ఆఫీసుల్లో దరఖాస్తులు పెండింగ్ లో పడుతున్నాయి. అత్యవసరమైన వారికి నిర్ణీత కాలంలో లైసెన్సులు మంజూరు కావడం లేదు. ఈ నేపథ్యంలో లైసెన్స్ ఇచ్చే అధికారాలను కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ స్కూల్స్‌కు అందించింది. అయితే, డ్రైవింగ్ సెంటర్లకు కేంద్రం కొన్ని షరతులు విధించింది. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించాలంటే కావాల్సిన అర్హతలు, అవసరాల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. టూ వీలర్ నుంచి హెవీ వెహికల్స్ వరకు వివిధ నిబంధనలను పొందుపర్చింది.
డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే వారు దరఖాస్తుదారులకు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. టూ వీలర్, త్రీ వీలర్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటార్ వెహికల్స్ లైసెన్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎకరం ఖాళీ ప్రదేశం కలిగి ఉండాలి. అదే హెవీ వెహికల్స్ కోసమైతే కచ్చితంగా 2 ఎకరాలు ఉండాలి. ట్రైనర్‌కి కనీసం 5 ఏళ్ల పాటు డ్రైవింగ్లో అనుభవం ఉండాలి. దీంతో పాటు కనీస విద్యార్హత 12వ తరగతి పాసై.. ట్రాఫిక్ నియమాల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి.
Read Also: Trivikram: రుకో జరా… సబర్ కరో… మే 31 హమ్ బాంబ్ లగాదేంగే
డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ సిలబస్, డ్యురేషన్‌ని కేంద్రం వెల్లడించింది. తొలుత దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు ఉన్నాయా చెక్ చేయాలి. లైట్ మోటార్ వెహికల్స్ వరకు లైసెన్స్ కోసం నాలుగు వారాల పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ సిలబస్‌ని రెండు విధాలుగా విభజించారు. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. మొత్తంగా ట్రైనింగ్ సెషన్‌లో 29 గంటల పాటు క్లాసులు నిర్వహించాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్ క్లాసులు అంటే.. రోడ్డుపై డ్రైవింగ్ శిక్షణ, మిగిలిన 8 గంటలు థియరీ క్లాసులు నిర్వహించాలి. అదే హెవీ వెహికల్స్ లైసెన్స్ కోసమైతే శిక్షణ కాలం ఆరు వారాల పాటు కొనసాగాలి. 8 గంటలు థియరీ, మరో 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు జరపాలి. డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌ని పై అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది.