పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణి వల్ల ప్రజల కష్టాలపై చర్చ జరిగిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ధరణి వల్ల లక్షలాది మంది యజమానులు రికార్డులు పట్టుకొని బిచ్చగాళ్ల లాగా ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు తిరుగుతున్నారని విమర్శించారు.
భూ సర్వే చేసి..రికార్డుల సవరణ చేయాల్సింది. ప్రభుత్వం అనాలోచితంగా ధరణి విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్ తమ భూమికి కూడా వాళ్ళు ఓనర్లుకాదని ధరణి చూపుతుంది. అనేక సర్వే నంబర్లు మిస్సయ్యాయి..మ్యుటేషన్ పోయింది.ధరణి బాధితులకు అండగా వారం రోజుల పాటు భూ పరిరక్షణ ఉద్యమం చేపడతామన్నారు శ్రవణ్.
మండల కేంద్రాల్లో భూ సమస్యలు ఎదుర్కొంటున్న ధరణి బాధితుల దగ్గర వినతి పత్రాలు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్తాం. ధరణి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ల అసైన్డ్ భూములను లాక్కున్నారు. ధరణి పోర్టల్ వల్ల సెక్యూరిటీ ఎంత వరకు ఉందని తెలియదు.భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తుంది..ప్రాజెక్టులకు లక్షల ఎకరాల భూమి లాక్కుంది..అప్పుడు భూముల విలువ ఆధారంగా లెక్కలు కట్టలేదు. దీంతో భూమి కోల్పోయిన బాధితులు నష్టపోయారు.
భూసేకరణ జరిగిన తరువాత ధరలు పెంచుతున్నామని ప్రజల నోట్లో మన్ను కొట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఖజానా ను పెంచుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటి కూడా పెంచాలని చూస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ధరణి బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రధాని ,రాష్ట్రపతిని కలుస్తామన్నారు.