CM Relief Fund: తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం సహాయనిధికి జీఎంఆర్ గ్రూప్ రూ.2కోట్ల 50 లక్షలు విరాళంగా అందించింది. కెమిలాయిడ్స్ (Chemiloids) కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు రూ.కోటి విరాళంగా అందించారు. విర్కో ఫార్మా రూ.కోటి విరాళంగా అందించింది. అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా అందించారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాయల రఘు సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని అందించారు. కంపెనీ ఎండీ రాయల రఘు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు.