దోమల్‌గూడ ఎల్పీజీ అగ్ని ప్రమాదం కేసులో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ సంఘటనలో కాలిన గాయాలతో మరో ముగ్గురు వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పద్మ (53), ధనలక్ష్మి (28), అభినవ్ (7) గురువారం కాలిన గాయాలతో మరణించగా, ఏడేళ్ల శరణ్య బుధవారం మరణించింది. దోమల్‌గూడలోని రోజ్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ సిలిండర్ లీక్ కారణంగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కాలిపోయారు.
బోనాల పండుగ సందర్భంగా కుటుంబంలోని మహిళలు అల్పాహారం సిద్ధం చేస్తుండగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఏడుగురు వ్యక్తుల్లో నలుగురు చనిపోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. Ntv తో దోమల్‌గూడ అగ్ని ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురికి నలుగురు చనిపోయారని, శరణ్య రెండు రోజుల క్రితం చనిపోగా ఇప్పుడు పద్మ, ధనలక్ష్మి, అభినవ్ ముగ్గురు చనిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకా ముగ్గురిలో, ఇద్దరు గాంధీలో ఉండగా మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చిన్నారి విహాన్ బ్రతకే ఛాన్స్ ఉందని, ప్రైవేట్ ఆస్పత్రి కావడంతో వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
సమయానికి ఫైర్ సిబ్బంది,108 అంబులెన్స్ రాకపోవడంతో నష్టం ఎక్కువగా జరిగిందని, అంబులెన్స్ లు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇండియన్ గ్యాస్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలన్నారు. వారి పై కేసు నమోదు చేయాలన్నారు.