మనలో చాలా మంది కొన్ని అవసరాలకు గాను ప్రభుత్వ అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతుంటారు. అందుకు కొన్ని నియమ నిబంధనలతోపాటు నిర్దిష్ట ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ.. ఇటీవల కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం జారీ అయిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. అయితే తాజాగా అదే బీహార్ రాష్ట్రం నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి ‘డాగేష్ బాబు’ అనే పేరున్న మరో కుక్క ఫొటోతో నివాస పత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశం కాస్త నవాడా కలెక్టర్ రవి ప్రకాశ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అతడిని అదుపులోకి తీసుకుని వేరే వ్యక్తులు ఇటువంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి దరఖాస్తుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఇలా దుర్వినియోగం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Perni Nani: ఏం పోయేకాలం వచ్చింది.. కూటమి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయం!
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల ముందు బీహార్‌లోని మసౌర్హి జోన్ ఆఫీస్ RTPS పోర్టల్ నుంచి జారీ అయిన కుక్క నివాస ధృవీకరణ పత్రం మొత్తం పరిపాలనా వ్యవస్థపై విమర్శలు వచ్చేలా చేసింది. ప్రభుత్వ అధికారుల పని తనాన్ని అద్ధం పట్టింది. ఆ రెసిడెన్స్ సర్టిఫికెట్‌లో ఆ కుక్క పేరు ‘డాగ్ బాబు’ అని ఉంచారు. అంతే కాదండోయ్ తండ్రి పేరు ‘కుట్ట బాబు’, తల్లి పేరు ‘కుటియా దేవి’గా ఉన్నాయి. మొహల్లా కౌలిచక్, వార్డ్ నంబర్ 15, నగర్ పరిషత్ మసౌర్హిగా అడ్రెస్ ఉండగా, సర్టిఫికెట్ నంబర్ BRCCO/2025/15933581గా నమోదు చేశారు. ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీహార్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.