ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో చేర్చబడ్డారు. అదానీ సామ్రాజ్యం ఎడిబుల్ ఆయిల్ నుంచి ఓడరేవుల వరకు విస్తరించింది. అయితే అతనికి ఎంత జీతం లభిస్తుందని చాలా మందికి సందేహం ఉంటుంది. అతను 2024 లో అందుకున్న జీతం ఇతర వ్యాపార సమూహాల చైర్మన్‌లతో పోలిస్తే చాలా తక్కువ. అదానీ గ్రూప్‌లో పనిచేసే ఇతర ఉద్యోగులకంటే ఆయన తక్కువ జీతం స్వీకరించారు. పీటీఐ ప్రకారం.. 61 ఏళ్ల భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 9.26 కోట్ల జీతం పొందారు. ఎడిబుల్ ఆయిల్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు, పోర్ట్ నుంచి పవర్ వరకు గౌతమ్ అదానీకి చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడ్డాయి. అయితే ఈ పది కంపెనీల్లో కేవలం రెండింటి నుంచి మాత్రమే ఆయన జీతం అందుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన 10 కంపెనీల వార్షిక నివేదికలో అదానీ గ్రూప్ ఈ సమాచారాన్ని పంచుకుంది.
READ MORE: Fishermen Arrest: 22 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..
అదానీ గ్రూప్ డేటా ప్రకారం.. గౌతమ్ అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.46 కోట్ల వేతనం పొందారు. ఇది గత సంవత్సరం కంటే 3 శాతం మాత్రమే ఎక్కువ. ఇది కాకుండా అదానీ పోర్ట్స్ నుంచి రూ.6.8 కోట్ల వేతనం అందుకున్నారు. ఇందులో రూ.5 కోట్ల కమీషన్ ఉంది. అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ జీతం దేశంలోని దాదాపు అన్ని పెద్ద కార్పొరేట్ గ్రూపుల ఛైర్మన్‌లు పొందుతున్న జీతం కంటే తక్కువ.