2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. సోమవారం జార్జియాలోని బటుమిలో జరిగిన టైబ్రేక్ రెండవ ర్యాపిడ్ గేమ్‌లో తెలుగు తేజం కోనేరు హంపీని ఓడించి (2.5-1.5) టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దివ్య చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకొన్నారు. అంతేకాదు క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత కూడా సాధించారు.
శనివారం, ఆదివారం జరిగిన రెండు క్లాసికల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. క్లాసికల్ మ్యాచ్‌లలో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపీ గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం టైబ్రేకర్‌కు చేరింది. ఇద్దరి మధ్య సోమవారం జరిగిన టైబ్రేకర్‌లో హంపీ ముందుగా నల్ల పావులతో ఆడగా.. దివ్య తెల్ల పావులతో ఆడి డ్రా చేసుకున్నారు. 15 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్‌లో 81 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించారు. ఆపై 15 నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఆడారు. ఈ టైబ్రేక్‌లో హంపి చేసిన తప్పిదాలతో (54వ కదలిక) దివ్య ఛాంపియన్‌గా నిలిచారు.
Also Read: AP DSPs Death: డ్రైవర్ డ్యూటీ చేయలేనని చెప్పినా.. బలవంతంగా పంపించారు!
ఈ విజయంతో దివ్య గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన నాల్గవ భారతీయ క్రీడాకారిణిగా నిలిచారు. హంపి, హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి దివ్య కంటే ముందు గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకొన్నారు. భారత్‌లో గ్రాండ్‌మాస్టర్ హోదా అందుకొన్న 88వ వ్యక్తిగా దివ్య నిలిచారు. ఇక ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా దివ్య, హంపి ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. మహిళా ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన జు వెంజున్‌తో దివ్య పోటీ పడనుంది.