Lunar Eclipse: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఆరోజున అందరూ ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల వెలుగులతో విరజిమ్ముతాడు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో పండగ జరుపుకోవడంపై చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకాలం ఏర్పడుతోంది. హిందూ పురాణాల ప్రకారం సూతకాలంలో ఎలాంటి పూజలు, శుభ కార్యక్రమాలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేసుకోవాలని భావించేవారు సూతకాలం ముందే వాటిని పూర్తి చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు.
Read Also: Tollywood: మళ్ళీ తెలుగు సినిమాకు ‘డబ్బింగ్ దడ’!
కాగా ఈనెల 8న సూతకాలం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:19 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం సాయంత్రం 5:32 గంటల నుంచి 6:19 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఉదయం 8 గంటలకు ముందే భక్తులు పూజలు పూర్తి చేసుకోవాలి. చంద్రగ్రహణం సమయంలో అన్ని ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఈ సమయంలో భగవంతుడిని దర్శనం చేసుకోవడం నిషేధమని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉంచడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సమయంలో తినడం, తాగడం వంటివి చేయకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా మద్యం అస్సలు సేవించరాదని వేదపండితులు హెచ్చరిస్తున్నారు. అటు గ్రహణం కీడు అని భావించే వారికి ఆధ్యాత్మకవేత్తలు వివరణ ఇస్తున్నారు. గ్రహణం వల్ల ఆధ్యాత్మిక లాభాలు అధికమని, గ్రహణం ఎంతమాత్రం కీడు కాదు అని పలువురు సూచిస్తున్నారు. సూతకాల సమయంలో శుచి, శుభ్రత, స్నానదానాలు, తర్పణాలు, ఆహార నియమాలు పాటించటం మంచిదని పండితులు సూచిస్తున్నారు.