Chilukuru Temple: గరుడ ప్రసాదం పంపిణీపై స్పందించారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. చిలుకూరు దేవస్థానంలో పంపిణీ చేయాల్సిన గరుడ ప్రసాదం పంపిణీని నిలిపిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారీగా భక్తులు వస్తుండటంతో ఇవాళ్టితో ప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం ఇచ్చామని వెల్లడించారు. మేం ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తుల రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశామన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. రేపు, ఎల్లుండి ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: TSPSC: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద గరుడ ప్రసాద వితరణ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపుచేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మరోవైపు, వాహనాలు రాకతో చిలుకూరు వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏకంగా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్‌హౌస్, సన్‌సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు బాలాజీ ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది.
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం అందజేయనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ఇటీవల ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలైంది. కార్లు, ఇతర వాహనాల్లో ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఎక్కడక్కడ వాహనాలు నిలిచిపోయి.. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి గరుడ ప్రసాదం వితరణను నిలిపివేశారు.