Dil Raju Birthday Special Story: ఓ వైపు మాస్ పల్స్ పట్టేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా, మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ గా జేజేలు అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ చిత్రం… ఇక సంక్రాంతి బరిలో సందడికి కొదువే లేదు అని సినీజనం భావిస్తున్నారు. అయినాసరే, వారి చిత్రాలు రంగంలో ఉన్నా, తాను నిర్మించిన తమిళ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగువారి ముందు ఉంచుతున్నారు దిల్ రాజు. ఆయన గట్స్ చూసిన వారు నిజంగా ‘దిల్’ ఉన్న రాజు అంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలకే థియేటర్లు దొరకకుండా చేస్తున్నాడు – దిల్ లేని రాజు అని మరికొందరి మాట! ఎవరు ఏమనుకున్నా తాను చేయాలనుకున్నది చేస్తూ పోవడమే తన బాణీ అంటూ సాగుతున్నారు దిల్ రాజు. ఒకప్పుడు పొంగల్ రాజుగా ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు రాజ్యం చేశారు. అయితే ఇప్పుడు ‘పొంగల్’ హంగామాలో తాను రాజునే అంటూ చాటుకుంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన అనేక చిత్రాలు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశాయి. అదే తీరున ఈ సారి తమిళ స్టార్ హీరో విజయ్ తో తాను నిర్మించిన ‘వారసుడు’ సినిమాను జనం ముందు నిలుపుతున్నారు. ఇందులో తప్పేముంది? అవును, సంక్రాంతి సంబరాల్లో ఎవరైనా పోటీకి దిగొచ్చు కదా!
మరి ఇంతలా దూసుకుపోతున్న దిల్ రాజు అసలు పేరు వెంకటరమణా రెడ్డి. 1970 డిసెంబర్ 18న నిజామాబాద్ నార్సింగ్ పల్లిలో జన్మించారు. ఆయనను బంధుమిత్రులు ‘రాజు’ అంటూ అభిమానంగా పిలిచేవారు. చదువుకొనే రోజుల నుంచీ రాజుకు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. హైదరాబాద్ వచ్చి, బంధువులతో కలసి తొలుత ఆటోమొబైల్ బిజినెస్ లో కాలుమోపారు. తరువాత సినిమాలపై అభిమానంతో అనుభవం కోసం కొన్ని పంపిణీ సంస్థల్లోనూ పనిచేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పట్టు సాధించగానే మిత్రులతో కలసి సొంత బ్యానర్ ‘శ్రీవేంకటేశ్వర ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్’ పెట్టుకున్నారు. తొలుత కోడి రామకృష్ణ ‘పెళ్ళిసందడి’ని నైజామ్ ఏరియాలో విడుదల చేశారు. ఆ పై అనేక విజయవంతమైన చిత్రాలను విడుదల చేసి పంపిణీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. దిల్ రాజుకు మణిరత్నం అంటే ఎంతో అభిమానం. ఆయన రూపొందించిన ‘కన్నత్తిల్ ముత్త మిట్టాల్’ను తెలుగులో ‘అమృత’ పేరుతో అనువదించారు. ఆ అనువాద చిత్రంలో దిల్ రాజు భాగస్వామి. అదే రాజు చిత్రనిర్మాణంలో తొలి అడుగు. తరువాత నితిన్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ సినిమా నిర్మించి విజయం సాధించారు. ఆ సినిమా సక్సెస్ తరువాత అందరూ ఆయనను ‘దిల్’రాజు అంటూ పిలిచారు. ఆ పేరే ఇప్పటికీ స్థిరపడిపోయింది.
18 pages: ‘స్టైలిష్’గా 18పేజెస్ ప్రీరిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే
టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి చిత్రాలను పంపిణీ చేసిన దిల్ రాజు, వారిలో పవన్ కళ్యాణ్, రవితేజ, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్, సిద్ధార్థ్, రామ్ పోతినేని, నాని, శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, సునీల్ వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. సీనియర్ స్టార్ వెంకటేశ్, మహేశ్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తెరకెక్కించిన రాజు, తరువాత వెంకటేశ్ తో వరుణ్ తేజ్ ను కలిపి ‘ఎఫ్-2, ఎఫ్-3’ చిత్రాలనూ రూపొందించారు. తమిళంలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించి, అదే సినిమాను ‘వారసుడు’ పేరుతో సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ నిర్దేశకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు రాజు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని రాజు తపిస్తూ ఉంటారు. అందువల్లే ప్రేక్షకులు సైతం దిల్ రాజు బ్యానర్ నుండి ఓ సినిమా వస్తోందంటే సదరు చిత్రంలో ఏదో వరైటీ ఉంటుందని విశ్వసిస్తూంటారు. నైజామ్ లోనే కాకుండా వైజాగ్ లోనూ దిల్ రాజు తన పంపిణీ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన మునుముందు మరిన్ని చిత్రాలతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.