ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది. అయితే, ధరణి సమస్యలు, వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు పోర్టల్‌లో ఆర్డీవో, తహసీల్దార్లకు అదనంగా కల్పించాల్సిన వెసులు బాట్లు, న్యాయ సంబంధ సమస్యలు, చేయాల్సిన మార్పులు- చేర్పులతో పాటు నిజామాబాద్ జిల్లాలో భూ భారతి వివరాలతో రావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యాయనం చేయాలని ధరణి కమిటీ చూస్తుంది.
Read Also: Bhatti Vikramarka : దేవాలయ ఖాళీ భూముల్లో భక్తుల కోసం కాటేజీలు
ఇక, ధరణి కమిటీ నిన్న (మంగళవారం) సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఇప్పటి వరకు వివరాలను సభ్యులు మంత్రికి తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల్లోగా ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధరణి కమిటీ నిర్ణయించిన విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వివరించినట్టు సమాచారం.