యాదాద్రి శ్రీలక్ష్మినృసింహా స్వామివారిని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు శనివారం దర్శించుకున్నారు. అయితే.. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్‌రావు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీనివాస్‌రావుకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మరో సారి వస్తుందని, సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం ఫోర్త్ వేవ్ వ్యాపించకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాకుండా.. యాదాద్రి శ్రీలక్ష్మినృసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా చూడాలని యాదాద్రీశుడిని కోరుకున్నానన్నారు.
Also Read : PVN Madhav: జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు ఉండదు.. త్వరలోనే ఉమ్మడి పోరాటాలు..!
ఫోర్త్ వేవ్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యామని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పోరాటం చేస్తుందని, కరోనాపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ఆయన వెల్లడించారు. తెలంగాణాలో వ్యాక్సినేషన్ 100శాతం వేశామని శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రస్తుతం వచ్చే వైరస్ ఫాస్ట్‌గా ప్రజల్లోకి వెళ్తుందని, ప్రాణాంతకమైంది కాదని భావిస్తున్నామన్నారు. గతంలో నేను చేసిన కామెంట్ ప్రస్తుతానికి అప్రస్తుతమన్నారు శ్రీనివాస్ రావు.
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీనివాస్ రావు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమయ్యిందని, వైద్యులు, మెడిసిన్ వల్ల కాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీనివాస్‌రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారాయి. శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. బాధ్యతాయుతమైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.