ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై విదేశాలకు వెళ్లే వారు ఏవిధమైన మోసాలకు గురికాకుండా తెలంగాణా పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘విదేశాలకు వెళ్లే వలస కార్మికులు, ఉద్యోగుల భద్రతా, క్రమబద్దీకరణ- పోలీస్ శాఖ చేపాట్టాల్సిన చర్యలు’ అనే అంశంపై డీజీపీ కార్యాలయంలో నేడు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఔసాఫ్ సయీద్, ఇమ్మిగ్రంట్స్ ప్రొటెక్టర్ జనరల్ జాయింట్ సెక్రెటరీ బ్రహ్మ కుమార్, అండర్ సెక్రెటరీ సుధీర్ కుమార్ మీనా, అడిషనల్ డీజీ లు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ సి.పి. సి.వీ ఆనంద్, రాచకొండ సి.పి డి.ఎస్. చౌహాన్ తదితర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Also Read : Crisis For Ashok Gehlot: గెహ్లాట్ సర్కార్ కు మరో తలనొప్పి.. రైతు ఆత్మహత్యతో సంక్షోభం
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు వివిధ వృత్తుల్లో నిపుణులైన వారిని పంపించడంలో ఇండియా అగ్రస్థానంలో ఉండగా, దీనిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర వహిస్తోందని తెలిపారు. ప్రధానంగా నర్సింగ్, పారా మెడికల్ రంగాల్లో సుశిక్షుతులైన మాన్ పవర్ ను విదేశాలకు ముఖ్యంగా మధ్య ప్రాచ్య దేశాలకు, యూరోపియన్ దేశాలకు పంపించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. అయితే, ఇదేసమయంలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్ , ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలనుండి వివిధ పనుల నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు, ఏజెంట్లు చేసే మోసాలకు గురవుతున్నారని అన్నారు.
Also Read : Crime : అందుకు ఒప్పుకోలేదని మహిళను చున్నీతో ఉరివేసి హత్య
ప్రధానంగా, కువైట్, కతర్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, మలేషియా, దుబాయ్ లకు వెళ్లే ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఈ మోసాలకు గురవుతున్నారని వెల్లడించారు. ఇటీవల కువైట్ కు వెళ్లి మోసపోయిన మూడు కేసులను విదేశీ మంత్రిత్వ శాఖ దృష్టికి తెలంగాణా పోలీస్ శాఖ తీసుకెళ్లిందని గుర్తుచేశారు. ఇదేవిధమైన పది మోసాలగురించి, నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ కూడా విదేశీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు. అయితే, రాష్ట్రంలో గుర్తింపు లేని విదేశీ నియామక సంస్థలు, అక్రమ నియామక సంస్థలు, టూరిస్ట్ ఏజెన్సీలపై గట్టి నిఘా ఉంచామని అంజనీ కుమార్ పేర్కొన్నారు.
భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఔసాఫ్ సయీద్ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధి అవకాశాల పేరిట తగు అనుమతులు లేకుండా అక్రమంగా విదేశాలకు పంపే ఏజెన్సీలకై కఠిన చర్యలు చేపట్టేందుకు గాను ప్రస్తుతం అమలులో ఉన్న 1983 ఇమ్మిగ్రేషన్ చట్టం స్థానంలో సరికొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్టు వెల్లడించారు. ఈ చట్టానికి తగు సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్రాలకు కూడా పంపించనున్నట్టు తెలిపారు.
గత సంవత్సరం ఇండియా నుండి 3 .70 కార్మికులు వివిధ దేశాలకు వలస వెళ్లారని, వీరిలో కొందరు అక్రమంగా వెళ్ళినవారు, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారున్నారని వెల్లడించారు. దక్షణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు పంజాబ్ రాష్ట్రాలనుండి వలస వెళ్లిన మహిళలు ఎక్కువగా మోసాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రధానంగా విజిటింగ్ వీసాలపై గల్ఫ్ దేశాలకు అక్రమంగా వెళ్తున్నారని అన్నారు. అయితే, వీరిని అక్రమంగా ఏ ఏజెంట్లు, ఎవరు పంపిస్తున్నారనే సమాచారంపై పోలీస్ శాఖ దృష్టి సాధించాలని కోరారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ అత్యంగా వేగంగా చేయడంలో తెలంగాణా రాష్ట్రం ముందంజలో ఉండడం పట్ల కేంద్ర కార్యదర్శి అభినందించారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సి.వీ ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 82 అనధికార, రిజిస్టర్ లేని రిక్రూటింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీలుండగా వీటిలో 52 హైదరాబాద్ లోనే ఉన్నాయని తెలిపారు. మోసాలకు పాల్పడే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవాలని రాచకొండ కమీషనర్ డీ.ఎస్. చౌహాన్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణా టామ్ కోమ్ సి.ఈ.ఓ విష్ణువర్ధన్ రెడ్డి, రీజినల్ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య, సంజయ్ అవస్థితదితరులు పాల్గొన్నారు.