కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా కళ్యాణం టికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాజన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఐక్యరాజ్యసమితి..
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పూర్తిగా అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. గతంలో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కనుగుణంగా 150 నుండి 200 నిత్య కళ్యాణం అర్జితసేవ టికెట్ల జారి చేసేవారు. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా ప్రస్తుతం పార్వతీపురం నిత్యాన్నదాన సత్రంపై స్వామివారి నిత్య కళ్యాణం కొనసాగిస్తున్నారు. స్థలం తక్కువగా ఉండడంతో ఇక్కడ 80 టికెట్ల వరకే కుదింపు విధించారు. వివాహాది శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరగడంతో రాజన్న నిత్య కల్యాణ అర్జిత సేవకు రద్దీ పెరిగింది. రద్దీ కనుగుణంగా ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజన్న భక్తులు. నేటి ఉదయమే కళ్యాణం టికెట్ల కోసం కౌంటర్ వద్ద పడి కాపులు కాసిన భక్తులకు టికెట్లు అందకపోవడంతో అధికారులతో వాగ్వివాదానికి దిగారు.