దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో (Delhi Metro Station) ప్రమాదం జరిగింది. ప్రహారీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు వినోద్‌కుమార్(53)గా గుర్తించారు. ఒక క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం డ్యూటీలకు వెళ్లే ఉద్యోగుస్థులంతా రోడ్లపైకి వచ్చారు. ఎవరి బిజీలో వారు ఉండగా సడన్‌గా గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌కు సంబంధించిన గోడ రాహదారిపై కూలింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై పడడంతో అక్కడికక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇక వాహనాలైతే శిథిలాల కింద చిక్కుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రమాదంపై మెట్రో అధికారులు స్పందించారు. దీనికి బాధ్యులుగా చేస్తూ సంబంధిత మేనేజర్, జూనియర్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసింది. మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు.. స్వల్ప గాయాలైన వారికి రూ.లక్షను ప్రకటించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.