Delhi CM Kejriwal : రైల్వేలో వృద్ధులకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ప్రధానిని ఆయన టార్గెట్ చేశారు. వృద్ధుల మినహాయింపును రద్దు చేయడం చాలా దురదృష్టకరమని.. వారి ఆశీర్వాదం లేకుండా దేశం అభివృద్ధి చెందదని కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల రాయితీని రద్దు చేసి చాలా కాలం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిని కోరారు.
Read Also: Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
రూ.1600 కోట్లు ఆదా చేసేందుకు వృద్ధులకు రాయితీ తొలగించడం సరికాదన్నారు. వృద్ధులను తీర్థయాత్రలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం తన బడ్జెట్‌లో 50 కోట్లు ఖర్చు చేస్తుందని, తద్వారా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేయాలని కేజ్రీవాల్ తన లేఖలో రాశారు. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లతో సహా మూడు కేటగిరీలు మినహా మిగిలిన అన్నింటికి ఛార్జీల మినహాయింపును రైల్వే నిలిపివేసింది. కరోనా మహమ్మారికి ముందు, 60 ఏళ్లు పైబడిన పౌరులు 50 శాతం తగ్గింపు పొందేవారు. మహమ్మారి ముప్పు తగ్గిన తర్వాత, దేశంలోని అన్ని ఇతర కార్యకలాపాలు పూర్తిగా సాధారణమైన తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు ఈ ఉపశమనం పునరుద్ధరించబడలేదు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలు పార్టీల నేతలు చాలా కాలంగా దీనిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.