Delhi Civic Polls Results: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. సాధారణ ఎన్నికలను తలపిస్తూ దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య ఉత్కంఠ భరిత వాతావరణంలో డిసెంబర్ 4న ఈ ఎన్నిక జరిగింది. నేడు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. ఢిల్లీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదు కాగా, మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు బీజేపీ, ఆప్. కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీగా భావించబడ్డాయి. ఢిల్లీ కార్పొరేషన్‍ను ఆమ్‍ఆద్మీ కైవసం చేసుకుంటుందని, బీజేపీ రెండో స్థానానికి చేరుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
2007 నుంచి నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లోనే ఉండడం గమనార్హం. ఆమ్‍ఆద్మీ పార్టీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టు సాధించలేదు. 2017 ఎన్నికల్లో 270 వార్డులు ఉండగా బీజేపీ 181 సీట్లు గెలిచింది. ఆమ్‍ఆద్మీ 48 చోట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 30 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఆమ్‍ఆద్మీ పార్టీకి తొలిసారి దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి.
ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ నగరవ్యాప్తంగా 42 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 68 మంది ఎన్నికల పరిశీలకులను కమిషన్ ఇప్పటికే నియమించింది, వీరి పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించేందుకు ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)కి చెందిన 136 మంది ఇంజనీర్లను కమిషన్ నియమించింది. ఈ 42 కౌంటింగ్ కేంద్రాల్లోని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై కమిషన్ వెబ్ పోర్టల్‌లో ప్రత్యక్ష ఫలితాలను వీక్షించేందుకు ప్రత్యేక మీడియా గదులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. 10,000 మంది పోలీసులు, 22 కంపెనీల పారా మిలటరీ సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. రాజకీయ పార్టీల కార్యాలయాల వెలుపల కూడా గట్టి సెక్యూరిటీ ఉండనుంది.
Parmliament Sessions: వాడీవేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. మీడియాతో సంభాషించనున్న ప్రధాని!
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ఫలితాలను మీడియా సిబ్బంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు కాశ్మీర్ గేట్‌లోని నిగమ్ భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఆప్, బీజేపీలు భారీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలతో సహా అగ్రనేతలు వీధుల్లోకి వచ్చి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి తర్వాత ఆమ్‍ఆద్మీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తమ విజయం ఖాయమని, ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. అయితే ఫలితాల కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే వస్తాయని ఆశాభావం వ్యక్త చేశారు. కేజ్రీవాల్ సుపరిపాలననే ప్రజలు ఎన్నుకుంటారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిశ్ సిసోడియా చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా తుది ఫలితాలు వస్తాయని, ఎంసీడీని బీజేపీ మళ్లీ చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ ఢిల్లీ జనరల్ సెక్రటరీ దినేశ్ ప్రతాప్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు ఏవైనా ప్రజాతీర్పును గౌరవిస్తామని చెప్పారు.