ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన నివాసానికి అధికారులు చేరుకుని కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అంతకముందు ఆప్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈడీ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉంటే తాజా పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ న్యాయ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ అధికారుల బలవంతపు చర్య నుంచి రక్షణ కల్పించాలని.. ఇందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్‌పై ధర్మాసనం స్పందించాలని కోరారు. కానీ శుక్రవారం రావాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు తొమ్మిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లపై ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. విచారణలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
మరోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇటీవలే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఆమెను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
కేజ్రీవాల్‌కు 10వ సారి ఈడీ సమన్లు అందజేసింది. అనంతరం 2 గంటల పాటు ఆయన్ను విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయి గతేడాది నుంచి జైల్లో ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి సైతం జైలుకెళ్తున్నారు. ఈ ఏడాది ఈడీ అధికారులు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు. ఇటీవలే మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేయగా.. తాజాగా రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్న తరుణంలో కేజ్రీవాల్ సర్కార్‌కు ఇదొక పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సిద్ధపడుతున్న సమయంలో ఆయన అరెస్ట్ పాలయ్యారు. మరీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారో చూడాలి. అలాగే తన వారసుడిగా ఢిల్లీ సీఎం పీఠాన్ని కేజ్రీవాల్ ఎవరికి ఇస్తారో సర్వత్రా ఆసక్తి నెలకొంది.