Daggubati Purandeswari: మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం అన్నారు.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది.. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని దుయ్యబట్టారు.. వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న ఆమె.. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు.. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారు..? అని నిలదీశారు.. ఇక, పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని బొత్సకు హితవు పలికారు దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Delhi: డానిష్ రాయబారి వీడియో వైరల్.. అందులో ఏముందంటే..?
కాగా, దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తిన విషయం విదితమే.. ప్రధాని పదవికి మోడీ విలువ లేకుండా చేశారని మండిపడ్డ ఆయన.. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని నిలదీశారు.. ఏపీ ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.. ప్రధాని మోడీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? అని గుర్తుచేశారు.. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడిన విషయం విదితమే.