D.K Shivakumar involved as Incharge for Telangana Congress: మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుండగా ఎలక్షన్ కమిషన్ అందుకు సర్వం సిద్ధం అయింది. తెలంగాణలో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్టు చెబుతున్న క్రమంలో గెలిచినా తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ఏఐసీసీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, డాక్టర్ అజయ్ కుమార్ సహా ఐదుగురు పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. సీఎల్పీ సమావేశం నిర్వహణకు వీరు పరిశీలకులుగా ఉండనున్నారు. ఈ క్రమంలో ఐసీసీ పరిశీలకులు అభ్యర్థులను కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలని సూచించారు. శనివారం రాత్రి బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు డీకే శివకుమార్. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గెలుస్తామని అందరూ చెబుతున్నారు, గెలిచే అవకాశాలు మాకే వున్నాయని అన్నారు. ఈసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆశతో ఉన్నామని మాకు ఎలాంటి ఆపరేషన్ భయం లేదు..మేము ఎవరికి భయపడటంలేదని అన్నారు.
Telangana Election Results 2023: ఓపెన్ చేసి దర్శనమిచ్చిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు?
ఆయనతో పాటు కర్ణాటక మంత్రి జార్జ్ కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌ను కాంగ్రెస్ ఈరోజుకు బుక్ చేసుకుంది, హోటల్‌లో 60 గదులు బుక్ చేయగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారి నుంచి ఎమ్మెల్యే ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ తాజ్ కృష్ణకు చేరుకోవాలని డీకే శివకుమార్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. తెలంగాణ అభ్యర్థులకు రక్షణగా కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలను రాష్ట్రానికి ఏఐసీసీ పిలిపించగా ఒక్కో నియోకవర్గ బాధ్యతను ఒక్కో కర్ణాటక ఎమ్మెల్యేకు అప్పగించింది ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థులను వారే హైదరాబాద్‌కు తీసుకొని రానున్నారు. కవేళ హంగ్ లాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ అభ్యర్ధులకు గాలం వేయకుండా కాంగ్రెస్ ముందుస్తుగా తమ అభ్యర్ధులను కాపాడుకునే క్రమంలో క్యాంపు రాజకీయాలకు తెర తీసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒక్కరోజే హోటల్ రూమ్స్ బుక్ చేయడంతో అవసరమైతే ఎమ్మెల్యేలను వేరే చోటికి తరలించే అవకాశం ఉందని ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఫలితాలు వెల్లడి కాకముందే కాంగ్రెస్ అధిష్టానం నుంచి సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, రణ్‌దీప్ సూర్డేవాలా కూడా రానున్నారని అంటున్నారు.