Cyclone Michuang Enters Bapatla: బంగాళఖాతంలో ఏర్పడిన ‘మిచౌంగ్’ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో గంటలో మిచౌంగ్ తుపాను పూర్తిగా తీరాన్ని దాటనుందని పేర్కొన్నారు. తుపాను బాపట్ల తీరం దాటిన తర్వాత.. సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేశారు. మిచౌంగ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అటు సముద్రంలో అలలు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు, కావలి మధ్య తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచాయి. ఈ గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోగా.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న గ్రామాల్లోని పూరి గుడిసెలు కూలిపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మచిలీపట్నం నుంచి చెన్నై వరకు సముద్రం 30 మీటర్లు ముందుకు వచ్చింది.
Also Read: Tirumala Annaprasadam: అన్నప్రసాద సముదాయంలో ఎలాంటి పిర్యాదులు రాలేదు: కరుణాకర్ రెడ్డి
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉంది. అటు రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది.