ఈ నెల 17న హైదరాబాద్ లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలసి స్వయంగా పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆ రోజున జరిగే భారీ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఆ ర్యాలీ లో భారీ సంఖ్యలో సాంస్కృతిక బృందాలు పాల్గొంటాయని, తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ విశేషాలను తెలిపే రంగుల ర్యాలీని ఉంటుందని ఆయన తెలిపారు. ఆదిలబాద్ జిల్లా ఆదివాసిల గుస్సాడీ నృత్యాలు, గోండు, లంబాడీ తదితర 30 రకాల కళారూపాలను ప్రదర్శించే కళాకారులు ఆ భారీ ర్యాలీలో పాల్గొంటారని, ర్యాలీలో పాల్గొంటున్న కళాకారులకు , ప్రజలకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ రోజున ట్రాఫీక్ నిర్వహణ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
Read Also: Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం రివార్డు.. రూ.50 లక్షలు అందజేత
ర్యాలీ తదనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు పాల్గొంటారని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని తగు విధంగా భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బారికేడింగ్‌లు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, తగు రవాణా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు అదనపు డీజీ జితేందర్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి ఎం. దాన కిషోర్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.