KKR Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ప్రతి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇప్పటికే పలు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ, కొన్ని జట్లు ఇంకా తమ గాడిలో పడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే ఇరుజట్లు గత మ్యాచ్‌లో ఓటమిపాలైన నేపథ్యంలో తిరిగి విజయబాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనను ఇవ్వలేకపోయాయి. KKR ఇప్పటికే తన సొంత మైదానంలో ఒక మ్యాచ్ ఆడగా, తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు SRH కూడా గత రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. ప్రస్తుతం IPL 2025 పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చిట్టచివరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో కోల్‌కతా 19 విజయాలతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాల బట్టి చూస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ కు కాస్త అడ్వాంటేజ్ కనపడుతోంది. ఈడెన్ గార్డెన్స్ మైదానం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సాధారణంగా ఎక్కువ స్కోరు చేయగలదు.