Rajoli Crime News: భూతగాదాలు ఎంతటి దారుణానికైనా దారితీస్తాయి. భూతగాదాల కారణంగా సొంత అన్న దమ్ములే బద్ద శత్రువులుగా మారతారు. అంతేకాదు చంపుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల కారణంగా సోదరుడిని హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మట్టుపెడదామనుకున్న ఇద్దరు అన్నదమ్ములు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి…
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషి రెడ్డి, చిన్ననాగి రెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. గొడవల కారణంగా కొంతకాలం కిందట మహేశ్వర్ రెడ్డి ఊరు వదిలి వెళ్లిపోయాడు. నాగి రెడ్డి, శేషి రెడ్డి మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో నాగి రెడ్డి, మహేశ్వర్ రెడ్డి సోమవారం శేషి రెడ్డిని హత్య చేశారు.
Also Read: Viral Video Today: స్టేడియం బయట బంతి.. బాల్ ఇవ్వనని మొండికేసిన ల్యాండ్ ఓనర్! వీడియో చూస్తే నవ్వాగదు
ఎవరికీ అనుమానం రాకుండా నాగి రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు బైక్‌పై శేషి రెడ్డిని మధ్యలో కూర్చోబెట్టుకుని మొహంపై ముసుగు కప్పారు. ఏపీలోని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్లారు. ముసుగు కప్పి ఉండడంతో అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో బయపడిపోయిన నాగి రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు శవాన్ని అక్కడే వదిలేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుడూరు, సీ బెళగల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.