అనంతపురం జిల్లాలో మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం నగర శివారు బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు నిన్న దారుణహత్యకు గురయ్యాడు. నేడు అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read: Outsourcing Staff: ఉద్యోగుల నియామకాలపై మంత్రుల బృందం ఆరా.. వారంలో మరోసారి భేటీ!
కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్ ఆరేళ్లుగా అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి పరిధిలోని సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో హోటల్ నిర్వహిస్తూ సురేష్ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ ముగించుకొని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.