Crime News: అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకునే వాడు దేవుడితో సమానం అంటారు. ఆర్ధిక అవసరం గట్టెక్కితే.. అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తారు. అలా డబ్బు సమయానికి ఇచ్చిన వాళ్లని ఎంతగానో అభిమానిస్తారు. ఐతే కాకినాడ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అప్పు తీర్చాల్సి వస్తుందని.. ఇచ్చిన వ్యక్తులనే హత్య చేశాడు. ఇద్దరిని చంపేసి..మూడో వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు చిక్కాడు.
కాకినాడ జిల్లా తాటిపర్తిలోని ఓ వ్యవసాయ బావిలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో వాళ్లను చంపింది గంగాధర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గంగాధర్. కాకినాడ జిల్లా తాటిపర్తిలో నివాసం ఉంటున్నాడు. సీజన్‌కు అనుగుణంగా బిజినెస్ చేస్తూ ఉంటాడు. మామిడి తాండ్ర అమ్మడం, ఒత్తులు బిజినెస్ ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏది అవకాశముంటే ఆ వ్యాపారం చేస్తాడు. ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కూడా కట్టాడు. గంగాధర్.. గ్రామంలోని చాలా మంది వద్ద అప్పులు కూడా చేశాడు. అప్పుల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఇల్లు కట్టాడనే టాక్ ఉంది.
High Court: కుటుంబం నుంచి విడిపోవాలని భర్తపై భార్య ఒత్తిడి.. హైకోర్టు సంచలన తీర్పు..
గంగాధర్.. సూరిబాబు, శ్రీను అనే వ్యక్తుల దగ్గర అప్పు తీసుకున్నాడు. వాళ్లిద్దరూ తమకు తెలిసిన వాళ్ల దగ్గర నుంచి కూడా గంగాధర్‌కు అప్పులు ఇప్పించారు. మరోవైపు గంగాధర్, సూరిబాబు, శ్రీను.. ముగ్గురు సమీప బంధువులు. గంగాధర్, సూరిబాబులు తోడు అల్లుళ్లు అవుతారు. గంగాధర్, శ్రీను మామ అల్లుళ్లవుతారు. సూరిబాబు, గంగాధర్ తాటిపర్తిలోనే కౌలుకి కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సూరిబాబు, శ్రీను.. గత కొంత కాలంగా తమ అప్పు తీర్చాలని గంగాధర్‌ను అడుగుతున్నారు. ఐతే గంగాధర్ దగ్గర అప్పు తీర్చేందుకు డబ్బులు లేవు. పైగా అప్పు తీర్చే ఆలోచన కూడా లేదు. దీంతో ఓ కంత్రీ ఆలోచన చేశాడు. అప్పు ఇచ్చిన వారిని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.
తన ప్లాన్‌లో భాగంగా.. సూరిబాబు, శ్రీనును తన పొలం వద్దకు పిలిపించాడు గంగాధర్. ముగ్గురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత తన అప్పుల విషయం గురించి వారితో మాట్లాడాడు. అదే సమయంలో ఒకరి తర్వాత ఒకరిని కిరాతకంగా స్పృహ కోల్పేయేలా దాడి చేశాడు. ఇద్దరినీ పొలంలోని వ్యవసాయ బావిలో పడేసి.. ఊపిరి ఆడకుండా చేశాడు. వారిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. తనకు అప్పు ఇచ్చిన మరో వ్యక్తి సూరిబాబు అలియాస్ బాబ్జీకి కూడా కాల్ చేశాడు గంగాధర్. అప్పు క్లియర్ చేసుకుందామని బుకాయించి పిలిపించాడు. తాటిపల్లి నుంచి గొల్లప్రోలు.. అక్కడి నుంచి కత్తిపూడి వైపు బండి మీద తీసుకుని వెళ్లాడు. చివరికి సుద్ధగడ్డ వాగు దగ్గర.. తన మొబైల్ ఫోన్ పడిపోయినట్లు డ్రామా ఆడాడు. అందులోనే డబ్బులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అప్పటికే కాస్తా చీకటి పడింది. బండి ఆపేసి సూరిబాబు అలియాస్ బాబ్జీ పీక నొక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో అటుగా వెళ్తున్న కారు లైట్ల వెలుతురు పడడంతో బాబ్జీ తప్పించుకున్నాడు.
అక్కడి నుంచి పరుగున తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లాడు బాబ్జీ. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. సూరిబాబు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే గంగాధర్ రెండు హత్యలు చేసినట్లు వాళ్లకు తెలియదు. ఐతే హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గంగాధర్ తన దగ్గరికి వచ్చేటప్పటికి వణుకుతూ కనిపించాడని బాబ్జీ తెలిపాడు. ముఖంలో చాలా టెన్షన్ ఉందని చెప్పాడు. సమయానికి కారు రాకపోతే తాను చనిపోయే వాడినని చెబుతున్నాడు.
మరోవైపు గంగాధర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సూరిబాబు పాలు తీసుకుని రావడానికి బయటకు వెళ్లాడు. ఇంతలోనే ప్లాన్ చేసి దానిని అమలు చేశాడు. సూరిబాబుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు. గంగాధర్ చేసిన దారుణానికి భార్యా, ఇద్దరు పిల్లలు అనాధలైపోయారు. తమకు దిక్కు ఎవరని సూరిబాబు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నిజానికి గంగాధర్ ఊళ్లో చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాడు. తృటిలో తప్పించుకున్న సూరిబాబు దగ్గర 4 లక్షలు, చంపేసిన సూరిబాబు, శ్రీను దగ్గర కలిపి 3 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వారు అప్పులు ఇప్పించారు. గంగాధర్‌కు అప్పు ఇచ్చిన వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తమను కూడా ఇదేవిధంగా చేస్తే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. అవసరానికి అప్పు ఇచ్చిన పాపానికి ఇంత దారుణానికి ఒడిగాడతాడా అని టెన్షన్ పడుతున్నారు. మూడో మర్డర్ కూడా జరిగి ఉంటే మిగతా వారిని కూడా టార్గెట్ చేసి ఉండేవాడని బయటపడలేకపోతున్నారు. తమకి కూడా అదే పరిస్థితి వచ్చి ఉంటే కుటుంబాలు అన్యాయం అయిపోయి ఉండేవని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని బయటికి కక్కలేక మింగలేక పోతున్నారు.
వాయిస్: డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఇల్లు కట్టడం కూడా ఒక కారణంగా పోలీసుల విచారణలో తేలింది. స్థాయికి మించి ఇల్లు కట్టాలని ఆశపడడం, అంతకు ముందే అప్పులు ఉండడం, అప్పులు ఇచ్చిన వాళ్లు వడ్డీ, అసలు క్లియర్ చేయాలని తరచూ ఒత్తిడి చేయడంతో ఒక ప్లాన్ ప్రకారం గంగాధర్‌లో రాక్షసుడు బయటికి వచ్చాడు. అప్పు ఇచ్చిన వాళ్ళు అడ్డు తొలగించుకుంటే ఇక తనను అడిగేవాళ్ళు ఎవరూ ఉండరని అనుకున్నాడు. బావిలో పడేసి ప్రమాదవశాత్తు పడిపోయారని కట్టుకథలు అల్లే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.