CPM Bus Yatra: రాష్ట్ర విభజన హామీలకు తూట్లు పొడిచిన కేంద్రంలోని మోడీ పాలనను సాగనిద్దామా..? సాగనం పుదామా..? అని సీపీఎం నేతలు ప్రశ్నించారు. గత తొమ్మిదిన్నరేళ్లలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా ల ఒకొక్కటిగా వివరించారు. అనాలోచిత ఆర్ధిక విధానాలతో ఆర్ధిక అసమానతలను పెంచడంతో పాటు మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని మండి పడ్డారు. రాష్ట్రంలోని వైసీపీ, టిడిపి, జనసేన ప్రజలపక్షమా… కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న మోడీ పక్షమా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి రాష్ట్ర బస్సుయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. రాజమమండ్రి లాలాచెరువు సెంటర్ నుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారుల డప్పులతో ఉత్సాహంగా ర్యాలీ ముందుకు సాగింది. సెంట్రల్ జైలు రోడ్డు, వై జంక్షన్, స్టేడి యం రోడ్డు, శ్యామలా సెంటర్‌లోని సీపీఎం కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి రెడ్ వాలంటీర్లు ఎర్రజెండాలు చేతబూని నిర్వహించిన కవాతు అబ్బురపరిచింది. తొలుత రెడ్ షర్ట్ వలంటీర్లు వారి మధ్యలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కలసి సభా ప్రాంగణం వద్దకు పాదయాత్ర చేస్తూ చేరుకున్నారు.
Also Read: Adimulapu Suresh: చంద్రబాబుకు ప్రజలను మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య..
అనంతరం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం నేతలు మాట్లాడుతూ.. విభజన చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని అన్నారు. జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను చేశారని వివరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు వెయ్యి రోజులుగా చేస్తున్న ఆందోళనలకు వైసీపీ, టీడీపీ కనీసం మద్దతు పలికిన దాఖలాలు లేవన్నారు. ఉక్కు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సీపీఎం అండగా నిలిచి ఖబడ్డార్ మోడీ అంటూ హెచ్చరించిదని గుర్తు చేశారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మందగించిందని అన్నారు. రైతాంగం గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గోదావరిలోని గ్యాస్ నిక్షేపాలు గుజరాత్ తరలిపోతున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ- అంబానీల సేవలో తరిస్తోందని అన్నారు. రైలు ప్రమాదాలు ప్రైవేటీకరణ ఫలితమేనని మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బటన్ నొక్కటం వల్ల ఎంత మంది జీవితాలు మారాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసగించారని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటరు ఏర్పాటు చేసి ప్రజల జేబులకు చిల్లుపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూనిట్ రూపాయికి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. పేదలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Seediri Appalaraju: ఏపీలో జనసేన త్వరలో కనుమరుగు.. జనసైనికులు ఒకసారి ఆలోచించాలి..
ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు ఏమి ఆశించి బీజేపీకి లొంగుబాటు అయ్యారని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రతి నిత్యావసర వస్తువూ 300 శాతం పెరిగిందని, పెట్రోల్ డీజిల్ ధరలు 300 నుంచి 500 శాతం వరకూ పెరిగిందని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధికి దూరమయ్యారని అన్నారు. అటువంటి వ్యక్తిని మళ్లీ గెలిపించమని పవన్ కళ్యాన్ కోరటం శోచనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను మోడీ ప్రభుత్వం లాగేసుకుంటోందని ప్రశ్నించాల్సిన జగన్ ప్రభుత్వం నోరెళ్లబెట్టి చూడటం చేతకానితనమేనని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఔన్నత్యాన్ని వివరించారు. అటువంటి సంస్థలను కారు చౌకగా కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పోటీపడి మద్దతు తెలపడం సరైంది కాదన్నారు. ప్రజలను రక్షించుకోవటం కోసం సీపీఎం చేపట్టిన ఈ ప్రజాపరిరక్షణ భేరికి ప్రజలు మద్దతు తెలపాలని 15వ తేదీన విజయవాడలో జరిగే ప్రజా గర్జనను విజయవంతం చేయాలని కోరారు.