V Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తే బాగుంటుందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. విపక్షాలు మండిపడుతున్నాయి.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు ఉమ్మేస్తారు అని హెచ్చరించారు.. ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రంలో రాజధాని వివాదం రేకేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రాన్నున్న ఎలక్షన్ లో ఓడించాలని పిలుపునిచ్చారు శ్రీనివాసరావు.. వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించిన ఆయన.. టీడీపీ – జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకి ఓటు వేసినట్టే అవుతుందని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వచ్చిన వాళ్లతో కలిసి పోరాడుతామని ప్రకటించారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.
Read Also: Public Examination Bill: పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..
కాగా, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.. ఉమ్మడి రాజధాని హోదాను హైదరాబాద్‌కు మరికొన్ని సంవత్సరాలు పొడిగించేలా తమ పార్టీ ఒత్తిడి తెస్తుందంటూ చేసినర వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. ఈ ఏడాది జూన్‌లో ముగియనున్న AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం.. హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ను సమర్థించారు. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో వైసీపీ ఈ డిమాండ్‌ను లేవనెత్తుతుందని అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో జాప్యానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడే కారణమని, తాత్కాలిక రాజధాని ఏర్పాటు పేరుతో టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. భారీ అమరావతి రాజధానిని నిర్మించేందుకు నిరాకరిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారని, ఆ నిధులను పేదల సంక్షేమానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారని, అయితే రాజధానిని మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే