Ramakrishna: రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అంటూ సీపీఐ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రికి చేరుకుంది. తాడితోట జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని రక్షించండి.. దేశాన్ని కాపాడండి అంటూ సీపీఐ ఆద్వర్యంలో బస్సు యాత్ర ఈ నెల 17 న ప్రారంభించి ఇప్పటివరకు 6 జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని రాజమండ్రికి చేరుకున్నామని అన్నారు. పోరాడే వాడికి ఎప్పుడూ ఎర్ర జెండా చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. కడియం పోలీసు స్టేషన్ లో దళిత యువకుడిని చిత్ర హింసలు పెట్టి.. మూత్రం తాగమని దాష్టీకం చేసిన ఎస్ ఐ కు అసలు బుద్దుందా? అని మండిపడ్డారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ హయాంలోనే దళిత డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును పక్కన పెట్టుకున్న ఘనత జగన్ దేనని ఆరోపించారు.
Read Also: Uttarakhand: మితిమీరిన వేగం.. గాల్లో ప్రాణాలు.. బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు రామకృష్ణ. నీకో న్యాయం.. దళితులకో న్యాయమా.. అంటూ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌లో శిరోముండనం చేస్తే చర్యలు తీసుకోలేదని, సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాలోనే పర్యటిస్తే.. వాళ్లపై అక్రమంగా దాడులు చేయించడమే కాకుండా తిరిగి కేసులు నమోదు చేయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడైనా అభివృద్ధి చేసావా జగన్ ? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నట్టేట ముంచి.. నిర్వాసితులను గుట్టలు ఎక్కి తలదాచుకోవాల్సిన దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలు నడుం బిగించాయని.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ.