CPI Narayana: తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. వరి పంట వేసిన రైతులు దారుణంగా నష్టపోయారని.. ఎకరానికి రూ.30 వేల రూపాయలు , తుఫాన్ ప్రభావిత ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు, దెబ్బతిన్న ఇళ్ళకు రూ.30 వేల రూపాయల సాయాన్ని తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: AP CM YS Jagan: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శ
వట్రపాలెం గ్రామం మునిగిపోవడానికి చుట్టూ ఉన్న అక్రమ లే అవుట్లే కారణమన్నారు. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాన్ని చూసి రాష్ట్రం గడగడ వణికి పోతోందని.. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి మూతులు నాకే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని నారాయణ విమర్శించారు. ఇకనైనా లాలూచీ ఆపితే అభివృద్ధికి మద్దతు ఇస్తామన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగన్ మాత్రమే 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారన్నారు. మోడీ, అమిత్ షాల దయా దాక్షిణ్యాలతో జగన్ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
Read Also: Seediri Appalaraju: విశాఖలో పవన్ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ..
తెలంగాణలో రాజకీయ మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారని.. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ అప్రజాస్వామ్య పాలన చేస్తూ ప్రజా వ్యతిరేక ఉద్యమాలను అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను కూడా సచివాలయానికి పోనీయలేదని పేర్కొన్నారు. అవినీతి పాలన కేసీఆర్ సొంతమని.. కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్వితే వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడుతోందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి మయమని.. కల్వకుంట్ల కుటుంబానికి అహంభావం పెరిగిందన్నారు. కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారని.. బీజేపీతో కేసీఆర్ రాజీపడ్డారని ఆయన అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసాయని ప్రజలు భావించారని.. అందుకే బీఆర్ఎస్ ఓడిందన్నారు. కేసీఆర్ సీఎం అవగానే గడీల వ్యవస్థను తీసుకొచ్చాడని.. గడీలలో పెట్టుకొని సచివాలయం, పగతిభవన్‌లోకి, ప్రజలను ఎమ్మెల్యేలను కూడా పోనీయకుండా చేశారని ఆయన మండిపడ్డారు. దాంతో ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారని.. ఆ గేట్లను పగలగొట్టి ప్రజలకు రేవంత్ రెడ్డి దగ్గరయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.