How Would Rajinikanth Look Without Makeup Said CPI Narayana: కలామ్మకు సేవ చేసే కార్మికులందరూ రోడ్డున పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదని.. కార్మికులు పని చేస్తేనే వారికి పేరొస్తుందన్నారు. హీరోలకు కోట్లలో పారితోషికాలా?, కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. హీరో, హీరోయిన్లకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా? అని మండిపడ్డారు. ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?.. ఓసారి అందరూ ఆలోచించండి అంటూ సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురు చేతుల్లో ఉందన్నారు. కార్మికులను విస్మరిస్తే.. కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మెపై సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘కలామ్మకు సేవ చేసే కార్మికులందరూ రోడ్డున పడ్డారు. సినిమా అంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదు. కార్మికులు పని చేస్తేనే వారికి పేరొస్తుంది. హీరోలకు కోట్ల రూపాయలా?, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వరా?. వారి సోకులకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా?. రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?. హీరో, హీరోయిన్లను అందంగా చూయించే కార్మికులను పట్టించుకోరా?. సందేశాత్మకమైన సినిమాలకు విలువ లేదు. పాన్ మసాల, మద్యం, జూదం, గుట్కాలు, నేర పూరితమైన సినిమాలకు విలువిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురు చేతుల్లో ఉంది. కార్మికులను విస్మరిస్తే కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కార్మికుల వైపుకు నిలబడతాం’ అని హెచ్చరించారు.
Also Read: Gold Price Today: షాకింగ్.. వరుసగా నాలుగో రోజు! హైదరాబాద్లో తులం బంగారం ఎంతంటే
‘ముఖ్యమంత్రి ప్రొడ్యూసర్లతో మాట్లాడుతారు కానీ.. సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వాలు కూడా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నాయి. బ్లాక్లో టికెట్లు అమ్ముకునే పద్ధతిని ప్రభుత్వాలు ప్రోత్సహించడం సరైంది కాదు. విలాసవంతమైన సినిమాలు తీసి, నైతిక విలువలను పాడు చేస్తూ కోట్లు గడుస్తున్న ప్రొడ్యూసర్లు.. కార్మికులను విస్మరించడం సరైంది కాదు. చిరంజీవి మీద నేను మాట్లాడిన మాటలను అప్పుడే వెనిక్కి తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. నన్ను బద్నాం చేయడం సరికాదు. ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అని సీపీఐ నారాయణ తెలిపారు.