హైదరాబాద్ పోలీసు కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. సీపీ పాల్గొని తనిఖీల విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు సిబ్బందికి సూచనలు ఇవ్వడమే కాకుండా.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సజ్జనార్ వివరించారు. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
‘ప్రతి రోజు మీడియాలో చెపుతూనే ఉన్నాం. అయినా చదువుకున్న వారు కూడా ఇలా డ్రింక్ చేసి వాహనాలు డ్రైవ్ చేస్తే ఎలా?. క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా వారం రోజుల నుంచి నగరంలో సెలబ్రేషన్స్‌పై పలు సూచనలు చేశాము. పబ్‌కి వెళ్లే వారు తమ డ్రైవర్లను వెంట తెచ్చుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకోవాలి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆదేశించాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబరు 31 రాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగుతాయి. నగరంలో 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు ఉంటాయి’ అని సీపీ సజ్జనార్ చెప్పారు.
Also Read: Real Estate Company: రెచ్చిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థ.. అర్ధరాత్రి బౌన్సర్లతో యజమానులపై దాడి!
‘మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తాం. అంతేకాదు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదు’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు.