18 ఏళ్లలోపు చిన్నారుల కోసం తయారైన కొవాగ్జిన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందించనున్నారు. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు సంస్థ అధికారులు తెలిపారు. మరో వైపు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అధికారులు వెల్లడించారు.
ఇన్‌ఫెక్షన్, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని తెలిపారు. వీటి ప్రయోగాలను మూడు విభాగాల్లో చేస్తున్నామని తెలిపారు. మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి రెండో డోసుగా ముక్కుద్వారా తీసుకునే డోసు ఇస్తున్నాం. అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసును ముక్కు ద్వారా అందించినట్లు అధికారులు తెలిపారు. మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నామని చెప్పారు. 650 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరుపుతుండగా.. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పరీక్షిస్తున్నామని తెలిపారు.