Constitution Day: న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అందరికీ న్యాయం చేయవలసిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. భారత్ లాంటి గొప్పదేశంలో న్యాయం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని ఆయన కోరుకున్నారు. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి భారత న్యాయవ్యవస్థ అనేక విషయాలను ప్రవేశపెడుతోందన్నారు.
Bank Holidays in December: డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, పూర్తి వివరాలు ఇవిగో!
న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలను ఆయన వివిరించారు. సుప్రీంకోర్టు ఢిల్లీలోని తిలక్ మార్గ్‌లో ఉన్నప్పటికీ, ఇది దేశం మొత్తానికి సుప్రీంకోర్టు అని.. ఇప్పుడు వర్చువల్ యాక్సెస్ ద్వారా న్యాయవాదులు వారి సొంత ప్రదేశాల నుంచి కేసులను వాదించడానికి అవకాశం కల్పించారని ఆయన వెల్లడించారు. కేసుల విచారణలో సాంకేతికతను అనుసరించాలని భావిస్తున్నట్లు సీజేఐ అభిప్రాయపడ్డారు. న్యాయవాద వృత్తిలో అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరిగా పెంచాలని సీజేఐ అన్నారు.
భారత్ ప్రతి ఏడాది నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీనినే సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ.. రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం కొత్తది కావడంతో దీనికి అంతగా ప్రాచుర్యం కలగలేదు.
2015 నవంబర్ 19న… కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. 2015 అక్టోబర్ 11న ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేస్తూ ఈ ప్రకటన చేశారు. భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది వరకు నవంబర్ 26న లా డేగా జరుపుకునేవారు. నవంబర్ 26న రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేడ్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.