Fraud Case: ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ అడ్డదారిలో కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు అయింది. ఒడిశా పోలీసులు హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులను అరెస్టు చేసారు పోలీసు అధికారులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ.. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట ప్రధాన మంత్రి కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ రంగాల్లో ఉన్న ధనవంతులను టార్గెట్ చేస్తూ, ప్రభుత్వ టెండర్లు ఇప్పిస్తామని నమ్మించేవారు. అందుకు సంబంధించిన ఫోటోలు, ఫేక్ సంబంధాలను చూపించి బాధితుల నుంచి భారీగా డబ్బు గుంజేవారు.
Also Read: HYDRAA: ఖాజాగూడ చెరువులో కూల్చివేతలు.. తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు!
అయితే, ఈ జంట చేతిలో మోసపోయిన ఓ గనుల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనంతరం భువనేశ్వర్ పోలీసులు హన్సితా, అనిల్ జంటపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అభిలిప్సా, అనిల్ మహంతి పలువురి వద్ద కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇక ఈ విషయంపై అడిషనల్ డీసీపీ స్వరాజ్ మాట్లాడుతూ.. ఈ జంట పీకే మిశ్రా సమీప బంధువులుగా పలువురిని మోసం చేశారని, బాధితులు ముందుకొచ్చి తమ ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 26న కేసు నమోదు చేయగా, బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం అని వెల్లడించారు. ఇక ఈ జంట చేతిలో మోసపోయిన వారు పోలీసులను సంప్రదించి తమ ఫిర్యాదులను నేరుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల సహకారంతో పూర్తి వివరాలను సేకరించి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రజలు ఇటువంటి మోసాలను గుర్తించి, మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.