హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
భగీరథమ్మ చెరువు నానక్‌రామ్ గూడా సర్వే నంబర్ 150, 151.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో దాదాపుగా 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ రెండు మండాలల పరిధిలోని నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ విస్తరించింది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం.. ఈ చెరువు మొత్తం 54 ఎకరాల్లో ఉంది. 2013లో 48 ఎకరాల మేర నీరు ఉందని ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు మ్యాప్ తయారు చేశారు. గత కొంత కాలంగా కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. చెరువును ఎండబెట్టి మరీ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Crime News: అయ్యప్ప మాలలో ఉండి.. భార్యను హత్య చేసిన భర్త!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూకటివేళ్లతో కూల్చేస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కూల్చివేతలు కొనసాగుతూన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా వందల అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేశారు.