TS Govt Alerts Gandhi Hospital over Coronavirus Cases Raise in India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతిచెందారు. కేరళలో నలుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. కేరళలో కొత్త వేరియంట్ జేఎన్ 1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు దేశ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. కరోనా పేషేంట్స్ కు చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో కొత్త వేరియెంట్ కేసులు బయటపడలేదని రాజారావు చెప్పారు. తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.
Also Read: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంతుందంటే?
జ్వరం, జలుబు, గొంతు నొప్పి, తల నొప్పి వంటి లక్షణాలు కొత్త వేరియంట్‌లో ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, గుంపుల్లోకి వెళ్లకపోవడం మంచిదని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, శానిటైజ్ చేసుకోవాలని వైద్యులు సూచించారు.