Corona Virus: కరోనా సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కరోనా భయాల నుంచి అందరూ బయటపడిన నేపథ్యంలో మళ్లీ కరోనా అని పేరు వినిపిస్తుండడంతో భయాందోళన కలుగుతోంది. తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. తాజాగా రాష్ట్రంలో ఒక కరోనా కేసు నమోదైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ కేసుతో ఇప్పటివరకు తెలంగాణలో 8,44, 492 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read Also: Andhrapradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఇవాళ ఒకరు కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 8,40, 377 మంది కోలుకున్నట్లు అధికారులు బులెటిన్ ద్వారా తెలిపారు. తెలంగాణలో కొవిడ్ బారిన పడి 4,111 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇంకా నలుగురు కొవిడ్ ఐసోలేషన్ లేదా చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణలో 415 కొవిడ్ టెస్టులు జరిగినట్లు హెల్త్ బులెటిన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అందులో ఇంకా 35 టెస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3 కోట్ల 91 లక్షలకు పైగా కొవిడ్ టెస్టులు చేశారు.