NTV Telugu Site icon

Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో హైదరాబాద్‌ అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులు కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ కేసీఆర్‌కు ఆ ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. రేవంత్, భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా శభాష్ అంటే.. పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో అనే భయంతో కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంచి చేస్తే తాము అభినందిస్తామని, కేసీఆర్‌కు అంత పెద్ద మనసు ఉండదు అంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Read Also: Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..

కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా చేయడం కోసమే మున్సిపల్ శాఖ కూడా సీఎం తన దగ్గరే పెట్టుకున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ హయంలోనే వచ్చిందని.. వ్యూహాత్మకంగా జంటనగరాల అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. ట్రాఫిక్, డ్రైనేజ్, మురిక వాడలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్‌ దిట్ట అని.. బీఆర్‌ఎస్ బడ్జెట్‌ హైప్‌ అని.. రేవంత్‌ బడ్జెట్‌ ప్రాక్టికల్ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.హుస్సేన్ సాగర్‌లో నీళ్ళు కొబ్బరి నీళ్ల లెక్క చేస్తా అన్నారు.. పదేళ్ళలో ఏమైందంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బడ్జెట్‌లో పెట్టి పనులు చేయబోతున్నారని తెలిపారు.

ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలు కూడా లేవని వెల్లడించారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో కూడా వర్షం వస్తే మునిగే కాలనీలు ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీకి రూ.3065 కోట్లు.. హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు.. హైడ్రాకు రూ.200 కోట్లు.. మెట్రో ఓల్డ్ సిటీ కోసం రూ.500 కోట్లు రేవంత్ సర్కార్‌ బడ్జె్ట్‌లో పెట్టిందన్నారు. సోనియా, రాహుల్‌ నాయకత్వంలో రేవంత్‌ 2024-25 లోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని చేస్తున్న ప్లాన్‌ ఇది అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ విమర్శలు రాజకీయం కోసమేనంటూ విమర్శించారు. కేసీఆర్‌కు విజన్ ఉంటే.. పదేళ్ళలో హైదరాబాద్‌కు నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.