JP Nadda: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు. కాంగ్రెస్ నాయకుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నారని, అలాంటి వారిని ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు. “కాంగ్రెస్ మానసిక దివాళా తీయడం వైపు పయనిస్తున్న తీరు ఖండనీయమైనది, బాధాకరమైనది. ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యకలాపాలు, వారి అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న పనులు ఖండించదగినవి’ అని నడ్డా అన్నారు. కర్ణాటకలోని మొలకాల్మూరులో జరిగిన మహాసభలో ఆయన ప్రసంగించారు.
బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి, కమీషన్, నేరగాళ్లకు పాల్పడుతున్నారని, విభజించి పాలించడమే తమ విధానమన్నారు. ఇప్పుడు వారు అన్ని హద్దులు దాటిపోయారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశ సార్వభౌమాధికారంపై ప్రశ్నలు లేవనెత్తారని, ప్రజాస్వామ్యం ఇక్కడితో ముగిసిందని అన్నారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాగాలాండ్‌లో కాంగ్రెస్‌కు సున్నా, మేఘాలయలో ఐదు, త్రిపురలో మూడు సీట్లు వచ్చాయన్న నడ్డా.. ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు, కాంగ్రెస్ ప్రమాదంలో ఉంది అనేది తెలుసుకోవాలన్నారు.
Read Also: Indian Army: భారత సైన్యంలో 7,000 మంది మహిళా సిబ్బంది.. కేంద్రం వెల్లడి
మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా ఇక్కడ జరిగిన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు ప్రసంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం విషయంలో అమెరికా, యూరప్‌ల జోక్యాన్ని కోరుతున్నందుకు రాహుల్ గాంధీ లాంటి నాయకులను ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. రాహుల్ గాంధీ భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యం గురించి బోధించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను లక్ష్యంగా నడ్డా వాగ్బాణాలను సంధించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని నడ్డా ఎత్తిచూపారు. ఈ బహిరంగ సభలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, రాష్ట్ర మంత్రులు ఆర్ అశోక, బీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో రాజకీయ సంస్కృతిని మార్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్న నడ్డా, కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రాజకీయాలు అవినీతి, కమీషన్, నేరాలీకరణ, వంశపారంపర్య పాలన అని, అయితే బాధ్యతాయుతమైన నాయకత్వంతో ప్రధాని రాజకీయాలు ప్రారంభించారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే నమ్మకం ఉన్న బలమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ స్థాపించారన్నారు.