కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకోవాలని చూస్తోంది. దీనికి రాజస్తాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న ‘ నవ కల్పన్ శింతన్ శిబిర్’ వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘ ఒక కుటుంబం- ఒక సీటు’ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తనపై ఉన్న కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకుంటోంది. దీంతో పాటు పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు, టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై లీడర్లు తమ బంధువులకు టికెట్ ఇప్పించే విధానానికి స్వస్తి పలుకుతోంది కాంగ్రెస్.
ఇదిలా ఉంటే మూడు రోజుల చింతన్ శిబిర్ నేటితో ముగియబోతోంది. కీలకమైన 6 అంశాలపై కాంగ్రెస్ తీర్మానాలు ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. దీనికోసం ఆదివారం ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కాబోతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతు, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మాణాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలుపనుంది. ఈ అంశాలపై ఏ తీర్మానాలు చేస్తారనే విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కాశ్మీర్ టూ కన్యాకుమారి యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రజా సమస్యలను తెలుసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం పాదయాత్రలే ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతోంది. వచ్చే ఏడాది ఈ యాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించానే వాదనలు ఎక్కువ అవుతున్నాయి. పార్టీలోని అనేక మంది నాయకులు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అధ్యక్షరాలుగా ఉన్న సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీకి పార్టీని అప్పచెప్పాలని నాయకులు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.