ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి హస్తం పార్టీ తిరస్కరణకు గురవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపింది.. కానీ ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించి.. ఎగ్జిట్ పోల్స్‌లో ఓటమిని ఎదుర్కొంటుందని తెలుసుకుందన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలపై మీడియా అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర ఆన్సర్స్ లేకపోవడం వల్లే చర్చలకు దూరంగా ఉందని అమిత్ షా ఎద్దేవా చేశారు.
Read Also: Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..
ఇక, న్యాయపరమైన తీర్పులు, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేనప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని అమిత్ షా తెలిపారు. బీజేపీ అనేక సార్లు ఓడిపోయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్‌ను ఏనాడూ బహిష్కరించలేదన్నారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించే అవకాశం ఉందన్నారు. కాగా, టీవీ చానెళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ చర్చల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నేటి (శనివారం) సాయంత్రం ఏడో దశ ఎన్నికలు ముగిసిన అనంతరం వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను 6. 30గంటలకు విడుదల చేయనున్నాయి.