TDP-Janasena: టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై పోటీ పెరుగుతోంది. విజయవాడ పశ్చిమం టిక్కెట్ విషయంలో పెరుగుతున్న పోటీ. విజయవాడ పశ్చిమ టికెట్ కోసం అంతర్గతంగా టీడీపీ-జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది. ఆ సీటు తమదేనంటూ టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రకటనలు ఇస్తుండగా.. మరో వైపు పశ్చిమ సీటు తమదేనంటూ జనసేన పార్టీ నాయకులు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయిస్తారన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయితే కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సీటు విషయంలో ఎవరికి వారు తమదేనంటూ బహిరంగ వేదికలపై పోటీపడి ప్రకటనలు గుప్పిస్తున్నారు.
Read Also: Janasena: ఎన్నికల కమిటీలను వేసిన జనసేన.. జోనల్ వారీగా కమిటీల నియామకం
ఇప్పటికే జనసేన తరపు నుంచి పోతిన మహేష్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో జనసేనకు కాకుండా టీడీపీకి టిక్కెట్ కేటాయించాలంటూ అధిష్టానంపై టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయవాడ పశ్చిమం టికెట్ తనకు ఇవ్వాలని.. తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తానని బుద్దా వెంకన్న నారా లోకేష్‌ను కోరినట్లు తెలిసింది. ఇరు పార్టీల నేతలు విజయవాడ పశ్చిమ టికెట్ తమకే ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం ఆ రెండు పార్టీల నేతల మధ్య దూరం పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే ఈ విధమైన గలాటాలు ఆ పార్టీ శ్రేణులను గందర గోళానికి గురిచేస్తున్నాయి.