GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ వేగవంతం అయింది. ఇప్పటికే ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రత్యేక ఆదేశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జారీ చేశారు. 27 మున్సిపాలిటీల్లో రికార్డులను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమీషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కమీషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ మున్సిపల్ కమీషనర్లు రికార్డ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా రికార్డ్స్ ప్రొఫార్మ రూపొందించాలని తెలిపారు.
Read Also: Mega Anil : చిరు సినిమాలో షూట్ పూర్తి చేసిన వెంకటేష్
ఇక, 27 మున్సిపాలిటీల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ల బాధ్యతల జాబితాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మున్సిపాలిటీల సిబ్బంది వివరాలు ఇవ్వాలని CDMAను జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. గ్రేటర్ లో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలలో ఉన్న సిబ్బంది వివరాలను తక్షణమే అందించాలని పేర్కొన్నారు. సాంక్షన్డ్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అత్యవసరంగా ఈ డేటాను కోరినట్లు కమిషనర్ లేఖలో స్పష్టం చేశారు.