పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రభాస్ నానమ్మ గా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్, ప్రభాస్ వ్యక్తిత్వం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?
నటి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ షూటింగ్ సెట్‌లో ఉంటే క్యారవాన్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. తన సీన్ లేకపోయినా అందరితో ముచ్చటిస్తూ సెట్‌లోనే గడుపుతారు. ఆయనలో ఎలాంటి ఈగో, ఆటిట్యూడ్ కనిపించవు’ అని జరీనా వహాబ్ తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ పంపే భోజనం గురించి చెబుతూ.. ఆయన ఒక్కడికే కాదు, సెట్‌లో ఉన్న అందరికీ ఇంటి నుంచి భోజనం వచ్చేలా చూసుకుంటారు, అందుకే ఆయన నిజమైన ‘డార్లింగ్’ అని ప్రశంసించారు. అంతే కాదు సౌత్ ఇండియాలో హీరోలకు ఉన్న సంస్కారం, గౌరవం నార్త్ ఇండియాలో కనిపించవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..
‘‘ప్రభాస్ మంచితనాన్ని చూసి, వచ్చే జన్మలో నాకు ఆయన లాంటి కొడుకే పుట్టాలని దేవుని కోరుతున్నాను’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్’తో పాటు ‘స్పిరిట్’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. స్టార్‌డమ్ తలకెక్కించుకోకుండా సామాన్యుడిలా ఉండే ప్రభాస్ తీరుకు జరీనా వహాబ్ వ్యాఖ్యలే నిదర్శనం.